రామ్ గోపాల్ పేట,మే 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
యుద్ధ ప్రాతిపదికన నాలాలోని పూడికను పూర్తి స్థాయిలోతొలగించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి రాంగోపాల్ పేట డివిజన్ కాచిబౌలి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా స్థానిక ఓపెన్ నాలాలో భారీగా పేరుకుపోయిన వ్యర్ధాలను చూసి వెంటనే అక్కడి నుండే వాటర్ వర్క్స్ MD కి ఫోన్ లో మాట్లాడారు. నాలాలో వ్యర్ధాలు, పూడిక తొలగించని కారణంగా మురుగునీటి ప్రవాహం నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుందని తెలిపారు. నాలా వెంట ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నాలాలోని మురుగు నీరు వర్షాకాలంలో కాలనీలోకి, ఇండ్లలోకి కూడా చేరుతుందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విన్నవించారు. వెంటనే నాలాలో పేరుకుపోయిన వ్యర్ధాలను, పూర్తి స్థాయిలో పూడిక తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా కాలనీలోని త్రాగునీరు కలుషితం అవుతుందని స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు.
బస్తీ దవాఖాన తనిఖీ
కాచి బౌలి లోని బస్తీ దవాఖాన ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. దవాఖాన లో అందుతున్న వైద్య, సేవలు, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది, మందులు లేవని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకట్ తో ఫోన్ లో మాట్లాడారు. స్థానిక ప్రజలు చేసిన ఫిర్యాదులను DMHO కు ఫోన్ లో వివరించారు. దీంతో తాను బస్తీ దవాఖాన ను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, AE చంద్రశేఖర్, వాటర్ వర్క్స్ DGM వెంకట్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, సంజయ్, గణేష్, చంద్ర ప్రకాష్, అరుణ్ భట్, ఆశారాణి, పుష్ప తదితరులు ఉన్నారు.



