పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావంతో పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడుకు టీడీపీ శ్రీకారం చుట్టిందని దీన్ని విజయవంతం చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఒంగోలులో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి డా. స్వామి మాట్లాడుతూ….పశ్చిమ ఆసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడుకు శ్రీకారం చుట్టిందన్నారు. నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేసి, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ స్థాయిలో డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్లలో అంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతి క్లస్టర్‌లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. మహానాడుకు హాజరయ్యే పార్టీ కార్యకర్తలకు ఆహారం, త్రాగునీటి వసతులు కల్పిస్తామని తెలిపారు. మండల, నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సారథ్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్‌చార్జులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొంటారని తెలిపారు. మొదటి రోజు ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరణ, సీనియర్ నాయకులకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే మండల, నియోజకవర్గ స్థాయిలో ఆమోదించిన తీర్మానాలను జాతీయ పార్టీ కార్యాలయానికి పంపించాలని మంత్రి సూచించారు. డిజిటల్ మహానాడును టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు.
