సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంతోనే ఇంధన సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి ఆదివారం పర్యటించారు. సంతమాగులూరు మండలంలో వివిధ గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బండివారిపాలెంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. బండివారిపాలెం నుంచి కేజీ రోడ్డు వరకు రూ.3 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు. సూర్యఘర్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., ఎక్కడో యుద్ధం వస్తే గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం మనం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంధన పొదుపులో భాగంగా., పగటిపూట సూర్యుని వేడితో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దేశ వ్యాప్తంగా పీఎం మోదీ సూర్యఘర్ పథకాన్ని కోటి కనెక్షన్లతో అమలు చేస్తుంటే… సీఎం చంద్రబాబు ముందుచూపుతో రాష్ట్రానికి 20 లక్షల సోలార్ కనెక్షన్లు కేటాయించేలా చర్యలు చేపట్టారని గొట్టిపాటి పేర్కొన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2 కిలోవాట్ల పరిమితి వరకు ఎస్సీలకు ఉచితంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూర్యఘర్ పథకంతో అన్ని వర్గాల వారికీ లాభదాయమే అన్న మంత్రి గొట్టిపాటి., మూడు కిలోవాట్ల ప్లాంట్లకు బీసీ వర్గాలకు రూ.98 వేలు, ఓసీ వర్గాలకు రూ.78 వేలు సబ్సిడీ అందుతుందన్నారు.

చెట్లు నాటాలని పిలుపునిచ్చిన మంత్రి గొట్టిపాటి..
బీటీ రోడ్డును ప్రారంభించిన అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ…గ్రామాల్లో ఇది వరకు మట్టి రోడ్లు ఉండేవన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు గ్రామ, గ్రామాన సిమెంట్, తారు రోడ్లు వేస్తున్నారని వెల్లడించారు. దీనితో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు 45 నుంచి 47 డిగ్రీలు ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఉష్టోగ్రతలు తగ్గాలంటే అందరూ చెట్లు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా మిన్నెకల్లు గ్రామంలో రూ.18 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. సుమారు 48 విలేజ్ హెల్త్ క్లినిక్ లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం చవిటిపాలెంలో జనచైతన్య హౌసింగ్ సహకారంతో నిర్మించిన ప్రగతి భవన్ ను మంత్రి గొట్టిపాటి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ప్రభుత్వం చేసేవి ప్రభుత్వం చేస్తుందని., ప్రజలు చేసేవి ప్రజలు చేయాలన్నారు. అదే విధంగా గత ప్రభుత్వం అన్యాయం చేసిన ఒంటరి, వితంతు పెన్షన్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు మంజూరు చేసిందన్నారు. కొంచెం ఆర్థిక వెసులుబాటు చూసుకుని కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కొత్త ఇళ్లను మంజూరు చేసే విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.




