ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే యోగ సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న యోగ సాధనలో భాగంగా బుధవారం సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ పంచభూతాల సంగమ ప్రాంతంలో ఉత్సాహంగా వారు యోగ సాధన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అంటే కేవలం కసరత్తు మాత్రమే కాదనీ, తనువును, మనస్సును, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి నుంచే యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతమైన పాకల బీచ్లో యోగా కార్యక్రమం నిర్వహించడం పర్యాటకానికి, ఆరోగ్యానికి రెండింటికీ మంచిదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహతో యోగాను ఆచరించాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో నైతిక విలువల పెంపునకు కూడా దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, స్థానిక ప్రజలు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. పతంజలి యోగా సంస్థ నిపుణుల పర్యవేక్షణలో సముద్ర తీరంలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.






