ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు ఉద్యోగుల 8 నెలల వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం దర్శి ఆర్‌డబ్ల్యూఎస్ డివిజన్ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు AITUC ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ కమిటీ (KKC) రాష్ట్ర చైర్మన్, దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ………గత 8 నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రజలకు తాగునీరు అందించే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కిల్ మరియు అన్‌స్కిల్డ్ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన SSR ప్రకారం వేతనాలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 8 నెలల జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికులు 8 నెలలుగా జీతాలు లేక స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్నా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అధికార పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీలకు ఈ సమస్య కనిపించడం లేదా అని వెంకట కృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు మంచినీరు అందించే కార్మికులు తమ కుటుంబాలను పోషించలేని స్థితిలో ఉన్నా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మికుల పట్ల ఈ నిర్లక్ష్య వైఖరి తగదని తెలిపారు.
సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించి, పెండింగ్ జీతాలను విడుదల చేయాలని కైపు వెంకట కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించకపోతే దర్శి, ముండ్లమూరు మండలాల్లోని ప్రతి గ్రామంలో కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు.
అదేవిధంగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు కైపు వెంకట కృష్ణారెడ్డి ప్రగాఢ నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AITUC ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు దర్శి మండల పరిశీలకులు ఈరిగినేని వెంకట నరసయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొడవటికంటి ప్రశాంత్, దర్శి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సిరిమల్లె పౌలేష్, ఎస్.కే. వలీ, ఆర్మోరు, శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికులు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
