జూన్ ,(జె ఎస్ డి ఎం న్యూస్) : మహానగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రకరకాల ఆశలు చూపిస్తూ అమాయకులను నిలువునా ముంచేస్తున్న కేటుగాళ్లు, ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని టార్గెట్ చేసి రూ. 2.22 కోట్ల భారీ మొత్తాన్ని గుంజేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడైన ప్రభుత్వ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను ఎక్కువగా గమనిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో భారీ లాభాలు వస్తాయంటూ వచ్చిన ఒక నకిలీ పెట్టుబడి (ఇన్వెస్ట్మెంట్) ప్రకటనకు ఆయన ఆకర్షితుడయ్యాడు. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్లు ఆయనను వాట్సాప్ ద్వారా సంప్రదించారు. అత్యధిక లాభాలు గడించవచ్చంటూ నమ్మబలికి, బాధితుడిని కొన్ని నకిలీ వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు.
ఆ గ్రూపుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందినట్లు ఉన్న బోగస్ స్క్రీన్ షాట్లను చూపిస్తూ బాధితుడిని పూర్తిగా నమ్మించారు. కేటుగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు వారు పంపిన ఒక నకిలీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అందులో సూచించిన అకౌంట్లకు దశల వారీగా డబ్బులు బదిలీ చేయడం ప్రారంభించాడు. అలా కొద్ది రోజుల్లోనే విడతల వారీగా ఏకంగా రూ.2.22 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు.
ఆ తర్వాత సదరు యాప్‌లోని డాష్ బోర్డులో బాధితుడికి రూ.3.1 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. ఆ మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాకు విత్‌డ్రా (వెనక్కి తీసుకోవడానికి) చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించగా, సైబర్ దొంగలు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఆ రూ. 3.1 కోట్లు విత్‌డ్రా చేసుకోవాలంటే అదనపు ఛార్జీలు, పన్నుల పేరుతో మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తాను దారుణంగా మోసపోయానని గ్రహించి లబోదిబోమన్నాడు. వెంటనే సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధితుడు డబ్బులు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దారి తప్పిన లింకులు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ పెట్టుబడి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
పెట్టుబడుల పేరుతో కేటుగాళ్ల ఘరానా మోసం -సనత్‌నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగికి రూ.2.22 కోట్ల టోకరా
14
Jun