మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే లక్ష్యంగా చర్యలు -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు -ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో ‘ పల్లెనిద్ర ‘ నిర్వహణ

మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని , ప్రధానమైన గ్రేజింగ్ ల్యాండ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తాము ‘… అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ డి.హిమవంశీలతో కలిసి లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ మనమిత్ర ‘ వాట్సప్ సేవలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ‘ కౌశలం ‘, విపత్తుల సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే ‘ అవేర్ 2.0 ‘ ఆన్లైన్ పోర్టల్ గురించి స్వయంగా కలెక్టరే ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని గర్భిణులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం.ల ద్వారా లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలని, పోషకాహారం తీసుకుంటూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, వైద్యుల ద్వారా పొందుతున్న సేవలపై గర్భిణులు సంతృప్తి వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలతో కూడా కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మెరుగైన జీవనోపాధి కోసం వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి గ్రేజింగ్ భూముల సమస్య ఉందని, దీని నుంచి శాశ్వత విముక్తి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్, విద్యుత్, వ్యవసాయ, సిమెంట్ రోడ్లు, భూముల మ్యుటేషన్, పశువులకు సంబంధించిన సమస్యలను కూడా ప్రజలు ప్రస్తావించారు. కలెక్టర్ వీటిని ఓపికతో విన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
                  ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రేజింగ్ భూముల విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి తగిన నివేదికను ప్రభుత్వానికి అందించేలా చూడాలని కలెక్టరును ఆయన కోరారు.
               ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీ.ఈ.వో. ( ఇంచార్జ్ ) జాలమ్మ, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దీనికి ముందుగా మండలంలోని అన్ని గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *