వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త సానికొమ్ము తిరుపతిరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసిపి అధిష్టానం అధికారిక ప్రకటన విడుదలైంది.
దర్శి నియోజకవర్గానికి చెందిన సానికొమ్ము తిరుపతిరెడ్డి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి విశేషంగా సేవలందిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా సానికొమ్ము తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి పదవిని అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ పదవి దక్కేందుకు సహకరించిన దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి, వ్యాపార వర్గాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
