వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధరలకే వందలాది ట్రాక్టర్లతో ఒంగోలులో పొగాకు రైతులు గర్జించారు. వర్జీనియా పొగాకు కొనుగోలు కంపెనీల నిలువు దోపిడీకి అడ్డుకట్ట వేసి క్వింటా పొగాకును రూ. 30 వేల గిట్టుబాటు ధరను ప్రభుత్వం నిర్ణయించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పొగాకు కొనుగోలుకు రూ. 1000కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించాలని జిల్లా నలుమూలల నుండి వచ్చిన పొగాకు రైతులు డిమాండ్ చేశారు. స్థానిక మినీ స్టేడియం నుండి ప్రారంభమైన ట్రాక్టర్ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి,సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టి పార్టీ వెంకటేశ్వర్లు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వడ్డే హనుమారెడ్డి, కె వీరారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జుజ్జురి జయంతి బాబు, ప్రధాన కార్యదర్శి పమిడి వెంకట్రావు, పరిటాల కోటేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కె మాబు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు సి ఎస్ సాగర్, నాంచార్లు అగ్రభాగాన్ని నిలిచి ర్యాలీ కి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం గత నెల రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన చేసి, వేలం కేంద్రాల వద్ద నిరసన తెలియజేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం క్వింటాకు రూ. 2000 మద్దతు ధర ఇస్తామని పేర్కొనటం దుర్మార్గమన్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు కొనుగోలుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పొగాకున కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పొగాకు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
