పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ -బేగంపేట్‌లో ఉచిత వైద్య శిబిరం

బేగంపేట జులై 5,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రహదారులపై నిరంతరం శ్రమిస్తూ, ట్రాఫిక్‌ను నియంత్రించే పోలీస్ సిబ్బంది ఆరోగ్యం కోసం బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. మల్కాజిగిరి సీపీ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ కె. రాహుల్ రెడ్డి చొరవతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రద్దీగా ఉండే రోడ్లపై ఎక్కువ గంటలు విధులు నిర్వహించే సిబ్బంది ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం.
ఈ శిబిరానికి తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ
జి. శంకర్ రాజు హాజరై మాట్లాడారు. ట్రాఫిక్ సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే నిరంతర శారీరక ఓర్పు అవసరమని, అందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన కోరారు.
రెటినోవా ఫౌండేషన్, శ్రీకర హాస్పిటల్, ప్లానెట్ ఆప్టిక్స్, పద్మ సాయి డెంటల్, స్కై ఫిట్ ఫిజియోథెరపీల సమన్వయంతో డాక్టర్ భవానీ, డాక్టర్ సాయి వంశీ, డాక్టర్ తిలక్ తదితర వైద్య బృందం సిబ్బందికి జనరల్ చెకప్‌తో పాటు కంటి, దంత, ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోగా.. సేవలందించిన వైద్యులకు, సంస్థలకు డీసీపీ కె. రాహుల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *