డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి యాజమాన్యం అందిస్తున్న ఉచిత సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. రెండు రోజులపాటు నిర్వహించేలా సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ఉచిత కంటి పరీక్షల స్క్రీనింగ్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను తాము నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు, ఉద్యోగులకు ఉచితముగా కంటి పరీక్షలు చేస్తున్నామని వారు చెప్పారు. సర్జరీ అవసరమైన వారికి ఈ.హెచ్.ఎస్., ఇన్సూరెన్స్, టీపీఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాల్లో నిర్వహిస్తున్నామని వివరించారు. వీరు అందిస్తున్న సేవలను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. తన కళ్ళకు కూడా పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు కళ్ళ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, అగర్వాల్ కంటి ఆసుపత్రి మేనేజర్ రజనీకాంత్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సాయి యశ్వంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

