చిన్నారుల్లో వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది – జిల్లా కలెక్టర్ ఎ. రాజాబాబు

ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లోని జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC)లో ఒమేగా రిహాబ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎ. రాజాబాబు మాట్లాడుతూ …. చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే లేదా బాల్యంలో గుర్తించే వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే వారి జీవితంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని అన్నారు.
సంతానం కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు అపారమని, అలాంటి సమయంలో పిల్లలకు ఏదైనా వైకల్యం ఉందని తెలిసినప్పుడు కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు, ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచిందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపోహలను ప్రజలు విడిచిపెట్టాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక ఖర్చులు భరించక ముందే జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. ఇక్కడ ఉచితంగా నాణ్యమైన వైద్యం, అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు, పునరావాస సేవలు అందుతున్నాయని తెలిపారు.
ఈ కేంద్రంలో జరుగుతున్న మంచి సేవలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
డాక్టర్లు సూచించిన ఫాలో-అప్ తేదీలను తల్లిదండ్రులు తప్పకుండా పాటించాలని, ప్రారంభ దశలో నిరంతర చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు.
దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు, పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సులభంగా అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
సమాజంలో దివ్యాంగ చిన్నారులకు అండగా నిలుస్తూ సేవలందిస్తున్న ఒమేగా రిహాబ్ ఫెడరేషన్‌ను, ఆసుపత్రికి సేవలందిస్తున్న మురళీకృష్ణ ని, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ బృందాన్ని, ముఖ్యంగా డాక్టర్ సునీత ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆశను, ఆత్మవిశ్వాసాన్ని అందించే వైద్యులు, సేవా సంస్థల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ సందర్బంగా పలువురు బాల భవిత కేంద్రం లో వారికి అందుతున్న సేవల గురించి తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా వెంకటేశ్వర్లు, బాల భవిత కేంద్రం నోడల్ ఆఫీసర్ డా భగీరధి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా శ్రీవాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా కిరణ్, వైద్య విభాగ అధిపతులు
డా మస్తాన్ బాషా, డా ఏడుకొండల రావు, డా ప్రభాకర్, డా తిరుపతి రెడ్డి, దివ్యంగుల శాఖ అడిషనల్ డైరెక్టర్ సువార్తమ్మ
, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *