‘ మీకోసం ‘ అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ‘ మీకోసం ‘ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పి.వెంకటరమణ, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 254 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కింద స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా జిల్లా స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శాఖాపరంగా పథకాల అమలును నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు. ‘ మీకోసం ‘ అర్జీల పరిష్కార తీరును పరిశీలించేందుకు, సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక అధికారిని పెడతామన్నారు. ‘ మీకోసం ‘ అర్జీలకు పరిష్కారం, ఐ.వి.ఆర్.ఎస్. ఫోన్ కాల్స్ లో సానుకూల ప్రజాభిప్రాయం పెంపు కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో మరింత చురుకుగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ‘ మీకోసం ‘ అర్జీలకు సకాలంలో సహేతుక పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిపిఓ అనుపమ, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


