ఆగస్ట్- 15 నాడు స్థానిక పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వహించే 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా దేశభక్తిని ఇనుముడింప చేసే విధంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజబాబు జిల్లా అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు పై ప్రచారం కల్పించేలా స్టాల్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత ప్రాథమిక రంగాల శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు తమ శాఖలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై శకటాలను ప్రదర్శించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా రెవెన్యూ అధికారికి సూచించారు. స్కూల్ పిల్లల చేత దేశభక్తి, సామరస్యత, మత సౌబ్రాతృత్వం వంటిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. సంబంధిత పోలీసు శాఖ వారు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బ్యాండ్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు తీసుకోవలసిన చర్యలపై ఆయన విపులంగా చర్చించారు. డయాస్ ఏర్పాటు, విఐపి గ్యాలరీ తదితరుములను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచిస్తూ ప్రోటోకాల్ నియమ నిబంధనలను తప్పక పాటించి ముందస్తుగానే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు డయాస్ చుట్టూ అనవసరమైన రాకపోకలను నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశభక్తిని చాటి చెప్పే విధంగా పోలీస్ బ్యాండు మరియు కవాతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంసి, డివిజనల్ అధికారులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .


