ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పంట పొలాల్లోని విద్యుత్ స్తంభాలకు అమర్చిన వైర్లను చోరీ చేస్తున్న అంతర్జిల్లా ముఠాను సంతమాగులూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పోలీసు అధికారి వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ బాలమురళీ కృష్ణ పర్యవేక్షణలో, సంతమాగులూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. శేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలు వి. నాగమల్లేశ్వర రావు, వై. నాగరాజు, సిబ్బంది సాంకేతిక సమాచారంతో ఆదివారం సాయంత్రం సంతమాగులూరు క్రాస్ రోడ్డు వద్ద గల గంగమ్మ గుడి వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
వారి వద్ద నుండి 7 కిలోల కాల్చిన రాగి వైరు, 150 కిలోల అల్యూమినియం తీగ, ఏపి 39 వి 3393 నెంబరు గల మహీంద్రా మురాజ్ కారు, కరెంటు స్తంభాలు ఎక్కే పరికరాలు-2, ఆధునిక నిచ్చెన-1, కట్టర్-1 లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు ఇలా..
పల్లపు వెంకట సాయికుమార్, తాటిమోకుల నాగేంద్ర, తన్నీరు చిట్టిబాబు, మంచికలపూడి వెంకటేశ్వర్లు, గంగుల కృష్ణ (గుంటూరు జిల్లా), మునిపల్లి ఏసుబాబు, లంకా వరప్రసాద్, (బాపట్ల జిల్లా).
11 కేసులు ఛేదింపు
నిందితులు గత కొంతకాలంగా రాత్రి సమయాల్లో పొలాల్లోకి వెళ్లి విద్యుత్ వైర్లను కత్తిరించి అమ్మేవారు. ప్రకాశంలో 3, బాపట్లలో 2, గుంటూరులో 4, పల్నాడులో 2 చొప్పున మొత్తం 11 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 30న సంతమాగులూరు పివిఆర్ రెసిడెన్సీలో కూడా చోరీకి పాల్పడ్డారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీసు అధికారి వి.హర్షవర్ధన్ రాజు అభినందించారు.
