బేగంపేట ఆగస్టు 17 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
అబద్ధపు హామీలు, ప్రజా వ్యతిరేక పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నేడు నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా ప్రజలకు అందకుండా చేస్తోందని బేగంపేట మాజీ కార్పోరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరంకుశ పరిపాలనకు నిరసనగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు ప్రకాష్ నగర్ డివిజన్ శ్యామ్ లాల్ బిల్డింగ్ ఆటో స్టాండ్ వద్ద మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, డివిజన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరేష్ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో లక్ష రూపాయలు అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు. ఎన్నికల్లో లక్షరూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి ఆడబిడ్డలను ఘోరంగా మోసం చేసిందని మండిపడ్డారు. ఉన్న పథకానికి ఎసరు పెట్టడమే కాకుండా, మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా లబ్ధిదారులకుఅందజేయకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాలను విక్రయిస్తూ, మరోవైపు పింఛన్లలో కోతలు విధిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీబాయి, మాజీ అధ్యక్షుడు ఎజాజ్, సీనియర్ నాయకులు రాజయ్య, రఘునాథ్, రమ, శ్రీను, సత్యనారాయణ, శశి కుమార్, వీరస్వామి, మహమ్మద్ షా నూర్, గులముద్దీన్, నారాయణ, సాయి గౌడ్, శ్రీకాంత్ యాదవ్, నరేష్, ఆమీర్ తదితర నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
