బేగంపేట ఆగస్ట్ 6
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బి ఎల్ ఓ లు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. SIR కార్యక్రమం గడువు ఈ నెల 10 వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్ లు, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, బూత్ లెవెల్ ఏజెంట్ లు ఇంటింటికీ వెళ్ళి ప్రతి ఓటరు తమ పూర్తి వివరాలతో కూడిన ఎన్యుమరేటర్ ఫారం ను సమర్పించేలా అవగాహన కల్పించాలని కోరారు. కొందరు ఓటర్లకు ఫారం లు అందలేదని, మరి కొందరు ఫారాలు తీసుకున్నా సమర్పించలేదని ఆయన పేర్కొన్నారు. ఫారం లు అందని వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని, ఫారం లు సమర్పించని వారు సమర్పించేలా చూడాలని చెప్పారు. గడువు లోగా వివరాలు సమర్పించని వారి ఓట్లు తొలగిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం గా చెబుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలని అన్నారు. ఇప్పటి వరకు 53 శాతం ప్రక్రియ పూర్తయిందని అధికారులు ప్రకటించారని, 4 రోజులలోనే మిగిలిన 47 శాతం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంపై సరైన అవగాహన లేని వారిని BLO లుగా నియమించిన కారణంగా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. BLO లు ఇంటింటికీ వెళ్ళకుండా ఏదో ఒక చోట కూర్చొని తమ వద్దకు ఓటర్లు రావాలని చెప్పడం జరుగుతుందని, దీనిని ఆయన తప్పుపట్టారు. బూత్ లెవెల్ ఏజెంట్ ల సహకారం అందించడం వలనే SIR కార్యక్రమం సవ్యంగా సాగుతుందని తెలిపారు. SIR కార్యక్రమం BLO లు, రాజకీయ పార్టీలు, BLA లది మాత్రమే బాధ్యత కాదని, ఓటర్లు కూడా తమ బాధ్యతగా భావించి తమ పూర్తి వివరాలు అందజేసి భాగస్వాములు కావాలని కోరారు. ఓటు హక్కు అంటే కేవలం ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుందనే అపోహ సరైంది కాదన్నారు. అనేక సందర్భాల్లో మీ గుర్తింపు ను నిర్ధారిస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. జాబితా నుండి ఓటు తొలగించిన తర్వాత బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి SIR కార్యక్రమాన్ని సీరియస్ గా నిర్వహించాలని ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు సమర్ధవంతంగా వ్యవహరిస్తే రాజకీయ పార్టీలు జోక్యం చేసుకునే అవసరం ఎందుకు వస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని విధులలో నియమించే ఎన్నికల సంఘం SIR కార్యక్రమంలో ఎందుకు బాధ్యతలు ఇవ్వదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా మ్యాన్ పవర్ ను పెంచి ఇంటింటికీ వెళ్ళి ఓటర్ల వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి. శ్రీహరి, లక్ష్మీపతి, ఏసూరి మహేష్, బూత్ లెవెల్ ఏజెంట్ లు, పలు డివిజన్ ల నాయకులు పాల్గొన్నారు.



