బేగంపేట ఆగస్ట్ 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బంగారం అనగానే కళ్ళు కుట్టుకునే ఈ రోజుల్లో ఒక పూజారి తన నిజాయితీని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. బేగంపేట పబ్లిక్ స్కూల్ సిగ్నల్ సమీపంలో రోడ్డుపై పడిపోయిన సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను రసుల్ పుర నల్ల పోచమ్మ దేవాలయ పూజారి శశిధర చార్యులు గమనించారు. ఆ
ఆభరణాలను ఏమాత్రం దురాశ పడకుండా వెంటనే బేగంపేట పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు.పూజారి అప్పగించిన సమాచారంతో వెంటనే బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులు సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. ఆ ఆభరణాలు ఆబిడ్స్కు చెందిన సాగర్ అనే వ్యక్తి బ్యాగు నుంచి పడిపోయినట్లు గుర్తించి, ఆయనను పోలీస్ స్టేషన్కు పిలిపించి బంగారాన్ని భద్రంగా అందజేశారు.
ఈ సందర్భంగా పూజారి శశిధర చార్యుల నిజాయితీని బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులుతో పాటు పోలీస్ సిబ్బంది కొనియాడుతూ ఆయనను ఘనంగా సన్మానించారు. పోయాయనుకున్న విలువైన ఆభరణాలను త్వరితగతిన గుర్తించి తనకు అప్పగించినందుకు బాధితుడు సాగర్ పూజారితో పాటు బేగంపేట పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
