‘ మీకోసం ‘ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ‘ మీకోసం ‘ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పి.వెంకటరమణ, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 284 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కింద స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా జిల్లా స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శాఖాపరంగా పథకాల అమలును నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు. ‘ మీకోసం ‘ అర్జీలకు పరిష్కారం, ఐ.వి.ఆర్.ఎస్. ఫోన్ కాల్స్ లో సానుకూల ప్రజాభిప్రాయం పెంపు కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో మరింత చురుకుగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అర్జీలకు సకాలంలో సహేతుక పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. తమ స్థాయిలో పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, జిల్లా స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

