అరుదైన కండరాల అసాధారణ పెరుగుదల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో వీల్ చైర్ కు పరిమితమైన ఆ బాలుడిని చూసి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చలించిపోయారు. బాలుని పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. సంతమాగులూరు మండలం కొప్పెరం గ్రామం నుంచి సహాయం కోసం సోమవారం కలెక్టరేట్లో ‘ మీకోసం ‘ కార్యక్రమానికి వచ్చిన ఆ బాలుని పేరు వల్లెపు పవన్ కిషోర్. వయస్సు 11 సంవత్సరాలు. ఆరేళ్ల వయసులోనే ఈ అరుదైన వ్యాధి బారిన పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అసాధారణ స్థాయిలో వయసుకు మించి కండరాలు పెరుగుతున్నాయని, ఫలితంగా తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్నాడని, తన బిడ్డ ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయం చేయాలని బాలుని తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి కలెక్టర్ ను కోరారు. తమ స్థాయికి మించి ఇప్పటికే రూ.7 లక్షలను వైద్యం కోసం ఖర్చు చేసామన్నారు. దీనితో బాలుని ఆరోగ్య పరిస్థితిపై డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ద్వారా కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. జన్యులోపం వలన ఈ పరిస్థితి వచ్చిందని, నయం చేసేందుకు రూ.26 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ బాలుని పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో కూడా ఫిజియోతెరపి చేయించేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం చేసేలా చూస్తామని బాలుని తల్లిదండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు.
