సనత్ నగర్ ఆగస్ట్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్)
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తునిచ్చేఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, దగ్గు సిరప్‌లను నిల్వ చేసి విక్రయిస్తున్న ఓ మెడికల్ షాపు అసిస్టెంట్‌తో పాటు మత్తుకు బానిసైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 4,80,300 విలువైన భారీ మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్), ఎస్సార్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ వెంకటగిరికి చెందిన పఠాన్ సలీమ్ (28), సనత్‌నగర్‌లోని వినాయక కన్స్ట్రక్షన్ భవనంలో ఉన్న తన సోదరుడి ‘స్మార్ట్ ఛాయిస్ హెల్త్ ఫార్మసీ’లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అన్న లేని సమయాల్లో ఫార్మసీ రబ్బరు స్టాంపులను దుర్వినియోగం చేస్తూ బ్లాక్ మార్కెట్లో నిషేధిత ఔషధాలను నిల్వ చేశాడు. ఇందుకోసం అదే భవనంలో ప్రత్యేకంగా ఒక గదిని అద్దెకు తీసుకుని టెర్మిన్ ఇంజెక్షన్లు, టాపెంటాడోల్ మాత్రలు, దగ్గు సిరప్‌లను దాచాడు. మత్తు కోసం తరచూ తన వద్దకు వచ్చే సనత్‌నగర్‌కు చెందిన నిరుద్యోగి ప్రశాంత్ రెడ్డి (19) సాయంతో వీటిని విక్రయిస్తున్నాడు.
మంగళవారం ప్రశాంత్ రెడ్డి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా సలీమ్ వద్దకు మందులు కొనుగోలు చేయడానికి రాగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న గోల్కొండ టాస్క్‌ఫోర్స్, ఎస్సార్ నగర్ పోలీసులు మెరుపు దాడి చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి 12 టెర్మిన్ ఇంజెక్షన్లు, 10 వేల టాపెంటాడోల్ 100 ఎంజీ మాత్రలు (100 బాక్సులు), 450 సెన్కాఫ్ దగ్గు సిరప్ బాటిళ్లు, 6 ఆల్కాఫ్ డిఎక్స్ సిరప్ బాటిళ్లతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖైరతాబాద్ జోన్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. మహేష్, ఎస్సై కె. వెంకటరమణ, ఎస్సార్ నగర్ పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

