ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటనను సంబంధించిన ఏర్పాట్లపై మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఎస్ ఎస్ జి అధికారులు మరియు ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు.అనంతరం దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం, హెలిప్యాడ్ ప్రాంతం నుండి జలహారతి వరకు, జల హారతి జరిగే ప్రదేశం, పైలాన్, గేట్లు, బహిరంగ సభా స్థలం, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలతో నృత్యం జరిగే ప్రదేశం, బహిరంగ సభా వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ వద్ద భారీ గేట్లు, ఫీడర్ కాలువ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు గా కేటాయించిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చూడాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం పర్యటన నిమిత్తం పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.



