బేగంపేట సెప్టెంబర్ 11,(జే ఎస్ డి ఎం. న్యూస్) :
బేగంపేట్ డివిజన్‌లో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ నసీర్ (అడ్డు) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సిద్దిఖ్ ఖాన్, మునీర్ ఖాన్ మరియు జమీర్, జీ హెచ్ ఎం సి డిప్యూటీ కమిషనర్ ఎ. సుజాతను కలిసి విజ్ఞప్తి చేశారు.సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఉన్న అమీర్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో మహ్మద్ నసీర్ డిప్యూటీ కమిషనర్‌తో వివరంగా చర్చించి, డివిజన్‌లోని పాడైన రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని మరమ్మతు చేయాలని కోరారు.
బేగంపేట్ డివిజన్‌లోని ఓల్డ్ కస్టమ్ బస్తీలో గత కొన్ని నెలలుగా కొత్త రోడ్డు వేసే పేరుతో పాత రోడ్డును పూర్తిగా వాడుకోలేని విధంగా తవ్వేశారని డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. దీనివల్ల ముఖ్యంగా నడిచి వెళ్లే మహిళలు, పాఠశాలకు వెళ్ళే పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అక్కడక్కడా పాత రోడ్డు శిథిలాలను గుట్టలుగా పోశారన్నారు. బస్తీలో రోడ్లు తవ్వడం వల్ల డ్రైనేజీ పైప్‌లైన్ కూడా దెబ్బతింది, దీనివల్ల స్థానికులు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారనీ వివరించారు.స్థానిక ప్రజలు బోనాలు పండుగ, ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగలను కూడా
ఇదే అధ్వాన్న రోడ్డుపై ఇబ్బందులతో జరుపుకున్నారని, ఇప్పుడు వినాయక చవితి పండుగలో కూడా ఇదే పాడైన రోడ్డు వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ నసీర్ సుజాత కు తెలియజేశారు.
ఈ సమస్యను వీలు అయినంత త్వరగా పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై సుజాత మేడం వెంటనే స్పందించి, ఏఈ గణేష్‌కు ఫోన్ ద్వారా కొత్త రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి, దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.



