హైదరాబాద్ అక్టోబర్ 27 (జేఎస్ డి ఎం న్యూస్ ) :
ఉపాధి నిమిత్తం ఒమన్ దేశం వెళ్లి మస్కట్‌లో గత రెండు నెలలుగా ఆచూకీ లేకుండా పోయిననిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ఆకుల రాజ్‌కుమార్ వ్యవహారంపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో జరిగిన సీఎం ప్రజావాణిలో బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాజ్ కుమార్ ఆచూకీని కనిపెట్టి న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణి స్టేట్ ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
ఈ విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఆమె, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ద్వారా ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయానికి అధికారికంగా లేఖ రాసి ఆచూకీ కనుగొనేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజ్‌కుమార్ భార్య స్వాతి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించిన విజయలక్ష్మి, ప్రభుత్వం బాధితులకు పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్మూర్‌కు చెందిన ఉజ్వల ట్రస్ట్ చైర్మన్ మీనీ శ్రీకాంత్ సారథ్యంలో మున్నూరు కాపు సంఘం నేతలు తేలు పెద్ద ఒడ్డెన్న, నడ్పి ఒడ్డెన్న, ఎన్నారై సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజావాణికి 140 అర్జీలు…….
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం జరిగిన 264వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 140 దరఖాస్తులు అందాయి. గద్వాల విజయలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎండార్స్‌మెంట్ చేశారు. వచ్చిన వినతులలో రెవెన్యూ శాఖకు 29 దరఖాస్తులు, పురపాలక శాఖకు 20, హోం శాఖకు 17 రాగా, ఇతర శాఖలకు చెందినవి 74 దరఖాస్తులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కె. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: