బేగంపేట నవంబర్ 1(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
అర్హులైన గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా నమోదుచేయించడంలో ఎన్నికల కమిషన్ అధికారులువిఫలమైనారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
విమర్శించారు. ఆదివారం ఆయన సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ లలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉన్నప్పటికీ బాధ్యతలను మరిచిపోయిందని పేర్కొన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కష్టపడి గ్రాడ్యుయేట్ ల నుండి ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి అధికారుల వద్దకు అందజేసేందుకు వెళితే తమ వద్ద సరిపడా సిబ్బంది లేరని చేతులెత్తేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా 2023 వరకు గ్రాడ్యుయేషన్ చేసిన వారినే ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ చెబుతుందని, 2025 వరకు గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఎందుకు ఓటరుగా అవకాశం ఇవ్వరని ఎన్నికల కమిషన్ అధికారులను ప్రశ్నిస్తే సమాధానం లేదని అన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గ్రాడ్యుయేట్ లను ఓటరుగా నమోదు చేసుకోవాలనడం ఏమిటని ఎన్నికల కమిషన్ అధికారులను ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం రాలేదని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ లు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులు కనీసం ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాలనీలు, అపార్ట్మెంట్ లు , బస్తీలలో ఇంటింటికీ వెళ్ళి అర్హులైన గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని కోరారు.
సనత్ నగర్ డివిజన్
సనత్ నగర్ డివిజన్ లోని మోడల్ కాలనీలో గల పూజిత అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ లు తమ ఓటరు నమోదు పత్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, శేఖర్, హరి, పీయూష్ గుప్త, పురుషోత్తం తదితరులు ఉన్నారు.
అమీర్ పేట డివిజన్
అమీర్ పేట డివిజన్ లోని బి టైప్ క్వార్టర్స్ లో గల శ్రీ రామ టవర్స్, SRT లోని సిటీజన్స్ ఎంక్లేవ్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ చేయాల్సిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని తాము చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు, అని దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓటరు నమోదు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, గుడిగే శ్రీనివాస్ యాదవ్, కట్టా బలరాం, ప్రదీప్ గౌడ్, కాలనీ ప్రతినిధులు గౌతమ్, రమణ, ప్రసన్న కుమార్, జోగిందర్ సింగ్, రాజిరెడ్డి, శ్రీకాంత్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








Save or share this story as a newspaper-style Epaper Clip: