మునిసిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్ననేపధ్యంలో ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ స్కూల్,డాన్ బాస్కో ఐటిఐ,ఆక్సిలియం హై స్కూల్, చీమకుర్తిలోని ఇస్లాంపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎంపీపీ స్కూల్, పాటిమీదపాలెం, అద్దంకిలోని శ్రీ ప్రకాశం జూనియర్ కళాశాలలో, శ్రీ ప్రకాశం బాలిక పాఠశాల మరియు పలు పోలింగ్ కేంద్రలను పరిశీలించి ఓటు వేసే క్యూలైనులు, ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల మరియు బందోబస్తును ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఎస్పీ మాట్లాడుతూ విధులలో అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలు చేయాలని, మొబైల్ ఫోన్స్, ఐ పాడ్, టాబ్స్ మరియు ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులు, రసాయన ఇంకు బాటిల్స్, వాటర్ బాటిల్స్ వంటివి తీసుకెళ్ళనియకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
100మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకొనే వారు తప్ప ఇతరులు లేకుండా చూడాలని, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సమయస్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ తెలియచేసారు. ఓటింగ్ సందర్భంగా వృద్ధులు మరియు వికలాంగులకు పోలీస్ సిబ్బంది చేయూతనిచ్చి వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా, సజావుగా జరగడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు,సీఐలు,ఎస్సైలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారని తెలియచేసినారు.
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, అన్ని కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు.
పోలింగ్ ప్రారంభానికి ముందే పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉంటూ, ఓటర్లు క్రమపద్ధతిలో ఓటు వేసుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వెలుపల ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, అదనపు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు, అంతరాయాలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా పోలీస్ 30 యాక్ట్163 BNSS సెక్షన్( 144 సెక్షన్) నిబంధనలపై ప్రజలకు సూచనలు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు తీసుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పకట్భంది ఏర్పాట్లు చేసేమని, అలాగే ఏవైనా సంఘటనలు జరిగే అవకాశమున్నా జరుగుచున్నట్లు తెలిసిన వెంటనే డయల్ –100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: