హైదరాబాద్ నవంబర్ 3, ( జెఎస్ డీ ఎం న్యూస్):
పేద మహిళల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగిస్తున్న అక్రమ అండాల సేకరణ ముఠా ఆగడాలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పత్రికలు, టీవీ ఛానళ్లలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్, ఈ దారుణ ఉదంతంపై తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేద మహిళలకు డబ్బు ఆశ చూపి ఏజెంట్లు ట్రాప్ చేస్తున్నట్లు వెల్లడైంది. వారిని రహస్య ప్రాంతాల్లో బంధించి, కనీస వైద్య ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని,ఈ అమానుష చర్యలు మహిళల ప్రాథమిక హక్కులు, శారీరక ఆరోగ్యానికి తీవ్ర ముప్పుకలిగిస్తున్నాయని కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ దందాలో ప్రైవేట్ ఆసుపత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లు, కొందరు వైద్యుల ప్రమేయంపై వస్తున్న అనుమానాలపైనా సమగ్ర విచారణ జరపాలని కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎంతమంది బాధితులను రక్షించారు, వారికి కల్పించిన షెల్టర్, కౌన్సెలింగ్, రక్షణ చర్యలేమిటి, నిందితులపై పెట్టిన కేసుల వివరాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని తీవ్రమైన మానవ అక్రమ రవాణాగా పరిగణిస్తున్నామని, మంగళవారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: