బాలల సమగ్ర అభివృద్ధికి కీలకం బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, యువజన సంక్షేమ శాఖ మరియు డీబీ ఆర్ సి స్వచ్ఛంధ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తాళ్లూరు మండలం నాగంబోట్లవారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ. పద్మ సునంద మాట్లాడుతూ బాలల హక్కులు, వాటి పరిరక్షణ, బాలల సమగ్ర అభివృద్ధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి బాలుడు, బాలికకు నాణ్యమైన విద్యను పొందే హక్కు ఉందని, విద్య ద్వారా పిల్లలలో జ్ఞానం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు. పిల్లలందరూ పాఠశాలకు వెళ్లేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.
పిల్లలకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం, వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు. జిల్లా న్యాయ మరియు పరివీక్షణ అధికారి బి.రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన బాలలలే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది అని అన్నారు.
బాలలను బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, హింస, వేధింపులు, వివక్షత, అక్రమ రవాణా వంటి సమస్యల నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పిల్లలకు సురక్షితమైన పాఠశాల, కుటుంబం, సమాజ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
జిల్లా స్టెప్ సీఈఓ పి. సాంబశివరావు మాట్లాడుతూ పిల్లలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం కల్పించాలని, పాఠశాల మరియు కుటుంబ నిర్ణయాలలో వారి ఆలోచనలు, అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని తెలిపారు. పిల్లల అభిప్రాయాలను వినడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
మండల విద్యాశాఖ అధికారి బి.సుబ్బయ్య మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యకలాపాలు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమని తెలిపారు. ప్రతి బాలుడు బాల్యాన్ని ఆనందంగా గడిపే హక్కు కలిగి ఉన్నాడని, ఆటలు పిల్లల్లో స్నేహభావం, క్రమశిక్షణ, సహకార గుణాలను పెంపొందిస్తాయని అన్నారు. జిల్లా చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ పి. దినేష్ కుమార్ మాట్లాడుతూ
బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుండి సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలి అని తోటి వారికి సహాయ సహకారాలు అందించే మంచి గుణాలు అలవర్చుకోవాలి అని డీబీ ఆర్ సి జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శి సిడిపిఓ ఆర్ పరిమళ బాల్య వివాహాల జరిగే అనర్థాలను ఈ కార్యక్రమం తో పాటు 100 రోజుల బాల వివాహ ముక్తి భారత్ ద్వారా తెలియజేశారు. పాఠశాల ఇంచార్జ్ హెడ్మాస్టర్ డి. శ్రీనివాసరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు మరియు టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: