బాల్య వివాహరహిత సమాజ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

బాల్య వివాహరహిత సమాజ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాల్యవివాహ నివారణ దినాన్ని పురస్కరించుకుని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ‘ బాల్య వివాహ ముక్త్ భారత్ ‘ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన మొత్తం సమాజ ఆర్థిక, సామాజిక స్థితిగతులు దిగజారుతాయన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వాటి వాస్తవ స్ఫూర్తితో క్షేత్రస్థాయికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో సంబంధిత శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మతాధిపతులు తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తద్వారా బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను అధిగమించి మంచి ఆర్థిక, ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. ఈ దిశగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేసిన అధికారులను, స్వచ్ఛంద సంస్థలను ప్రత్యేకముగా అభినందిస్తామని కలెక్టర్ ప్రకటించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాలికల పట్ల సమాజ ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లను భారంగా భావించి, బాల్యంలోనే పెళ్లి చేయటం సరికాదన్నారు. వీటి వలన కలిగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన దుష్పరిణామాలపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు వివరించాలన్నారు. పాఠశాలల్లో కల్పిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో బాల్య వివాహాల నివారణ కమిటీలు కూడా మరింత చురుకుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
ఐసిడిఎస్ పి.డి. పద్మా సునంద మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 87 బాల్య వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పూర్తిస్థాయిలో ఆపివేశామని చెప్పారు. తమ శాఖ తరపున చేపట్టిన ఈ కార్యక్రమాల పురోగతిని వివరించారు. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, జిల్లా గిరిన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, జిల్లా బాలిక అభివృద్ధి అధికారి హేమలత, డీసీపీఓ దినేష్ కుమార్, యువసాథీ మిషన్ డిపిఏ సిద్ధిక్ ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ మతాల పెద్దలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాల్యవివాహాల నివారణ కోసం తమవైపు నుంచి చేపడుతున్న చర్యలను వివరించారు.
బాల్య వివాహాలను ఎదిరించి ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఇద్దరు బాలికలు ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. తమ ఫిర్యాదులపై వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే బాధ్యులపై చట్టపరంగా తీసుకునే చర్యలను వివరించేలా రూపొందించిన వాల్ పోస్టరును ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ , ఇతర అధికారులు ఆవిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *