విద్యతో పాటు యుద్ధవిద్యలోనూ, సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ భక్త కనకదాసు నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు అన్నారు. కనకదాసు జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నతనంలోనే విద్యతోపాటు యుద్ధవిద్యలలో ఆరితేరి విజయనగర సామ్రాజ్యంలో దళపతిగా (నాయకుడిగా) పనిచేశారని చెప్పారు. కనకదాసు సామాన్యులకు సైతం అర్థమయ్యే సరళమైన కన్నడ భాషలో సుమారు 240కి పైగా కీర్తనలు రచించారని తెలిపారు. తన రచనల్లో ‘ కాగినెలె ఆదికేశవ ‘ అనే ముద్రను ఉపయోగించారని, కులమత భేదాలు, మూఢనమ్మకాలను ఖండిస్తూ సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని కొనియాడారు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన కనకదాసును నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని తాము ఎంచుకున్న రంగంలో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, ఇతర అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: