సనత్నగర్,నవంబర్ 27 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
పట్టభద్రుల సమస్యల పరిష్కారం, విద్యావ్యవస్థ పరిరక్షణే లక్ష్యంగా సమర్థవంతమైన నాయకులను చట్టసభలకు పంపించాలని తెలంగాణ రక్షణ సేన ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లూరు ఆకాష్ పిలుపునిచ్చారు. శుక్రవారం సనత్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కడెం అర్చన అధ్యక్షతన బల్కంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో సుమారు
8 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలోవిఫలమైందనివిమర్శించారు. ఫీజు
రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ సమస్య, విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, పోక్సో కేసులు పెరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ హామీని నిలబెట్టుకోలేదని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. గతంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పట్టభద్రుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రజా సమస్యలు, విద్యారంగ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాన పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిజాయితీ, విషయ పరిజ్ఞానం, ప్రజాసేవా దృక్పథం ఉన్న అభ్యర్థులను ఆదరించాలని పట్టభద్రులను కోరారు.ఈ సమావేశంలో నాయకులు పడాల మనోజా, రఘు, ధరణి, గీతానాధ్, సోనుబాయ్, మౌనిక, హాలీమా, సోనాలిక, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: