ప్రకాశం జిల్లాలో 8 మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు.
కొండేపి నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికలలో తుమాడు, యు.ఉప్పలపాడు, మిట్టపాలెం, కామేపల్లి, రామచంద్రాపురం వెన్నూరు, నేతివారిపాలెం మరియు పలు పోలింగ్ కేంద్రాలతో పాటు కందుకూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమ పద్ధతిలో ఓట్లు వేసేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పోలింగ్ నిర్వహణ తీరు, పోలీస్ బందోబస్తు మరియు భద్రత ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల్లో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియజేస్తూ, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర పెట్రోలింగ్, మొబైల్ పార్టీల ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా గుమిగూడకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కందుకూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.
ఓట్ల లెక్కింపు అనంతరం విజయం సాధించిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, బాణాసంచా కాల్చరాదని సూచించారు. అదేవిధంగా, సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా కార్యకలాపాలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల బందోబస్తులో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: