జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన గుంటిగంగా భవాని ఆలయం 98వ వార్షికోత్సవ తిరునాళ్లకు ముస్తాబైంది. గంగా భవాని తిరునాళ్లను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. తాళ్లూరుమండలంలోని తూర్పుగంగవరం పంచాయితీ పరధిలో ఈ ఆలయం ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా గంగమ్మతల్లిని కోలుస్తారు. ప్రతి ఏడాది చైత్రమాసం బహుళ విదియనాడు వైభవంగా తిరునాళ్లను నిర్వహిస్తారు. కొండకోనల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతకు ఆలవాలం….
ఇదీ స్థలపురాణం……
గంగా భవాని ఆలయం 12వ శతాబ్దం నాటిదని, కాటంరాజు కాలంలో నిర్మించిన గంగమ్మ దేవాలయాలలో ఇది ఒకటని స్థానికులు చెబుతున్నారు. ఈ గుడికి దక్షణం వైపు కొండపాడు వద్ద ఉన్న పెద్దరాతి గుండు క్రిందగా నీరు ప్రవహిస్తుండటం వల్ల దీనిని గుండుగంగగా పిలిచేవారు. ఏడాది పోడవునా ప్రవహించే జల ఆధారంగా చుట్టు ప్రక్కల గ్రామాల రైతులు పంటలు పండించేవారు. ఈజల గంగమ్మతల్లి వరప్రసాదముగా భావించి ఏటా తిరునాళ్లు జరపటం అనవాయితీగా వస్తుంది. జలధారపైన ఉన్న గుండును తొలగిపై ఇంకా పెద్దదవుతుందని భావించిన రైతులు దానిని ప్రక్కకు తొలగించారు. దీంతో అక్కడ గుంత ఏర్పడినది కాని నీరు మాత్రము పెరగలేదు. అప్పటినుండి గుంటగంగాగా పిలుస్తూ కాలక్రమంలో గుంటిగంగ గా మార్పుజరిగినది. దీన్ని దక్షణ కాశీగా కూడ పిలుస్తారు.
పూర్వం మునులు తపస్సు చేసుకొంటూ గుంటిగంగలో స్నానమాచరించి శివాలయంలో పూజలు చేసేవారని చెబుతారు. ఈప్రాంతంలో ఎప్పుడూ మునులు జపిస్తున్న మంత్రాలు వినిపిస్తుండేవని, అందువల్ల ఈ ప్రాంతాన్ని స్వాములవారి ధ్వనీ అనిపిలిచేవారని పెద్దలు చెబుతుంటారు. దశాబ్దం క్రితం గంగమ్మ, శివాలయంలను పునరుద్దరించారు. ఈ ప్రాంతంలోనే క్రిష్ణాలయం, కాశీనాయన ఆశ్రమం, నాగదేవత పుట్ట ఉన్నాయి.
పూర్వం ఈ ఆలయం కోండకోనల మధ్యఅడవిలో ఉండటంతో తిరునాళ్లను పగలు చేసేవారు. క్రమేపి అడవి అంతరించి పోవటంతో రాత్రివేళల్లో చేస్తున్నారు. ఈతిరునాళ్లను తిలకించేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారు. తిరునాళ్ల సమయంలోనే కాకుండా శుక్ర, ఆదివారాలలో భక్తులు వందలసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారికి పొంగళ్లు, నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఇక్కడ వివిధ పలు ఆలయాలు, కులాల సత్రాలు ఉన్నాయి శ్రీశైలం తర్వాత అన్ని వర్గాలకు చెందిన కులసత్రాలు అధికంగా ఉన్నది ఇక్కడే. ఈసత్రాల వద్ద తిరునాళ్లరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. దేవ స్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రత్యేక వసతి గదులు, పొంగళ్ల ఏర్పాటుకు సత్రాలు ఎంతో అభివృద్ధి చేయటంతో భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉన్నది.
విద్యుత్ ప్రభలు ఏర్పాటుకు సన్నాహాలు …. గుంటిగంగాభవానీ తిరునాళ్లకు 11 విద్యుత్ ప్రభలను పలు రాజకీయ పార్టీల మద్దతు దారులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధించినవి ఏడు ప్రభలు ఉండగా, రెండు టిడిపి, రెండు జనసేన పార్టీల మద్దతు దారులు ఏర్పాటు చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో బందో బస్తు…
గుంటిగంగాభవానీ తిరునాళ్లకు దర్శి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 30మంది ఎస్సైలు, మూడు ప్రత్యేక పార్టీలతో తో దాదాపు 600 మంది బారీబందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు దర్శి సిఐ రామకోటయ్య తెలిపారు.
తూర్పుగంగవరం, తాళ్లూరులలో ట్రాఫిక్పై కూడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఎస్సై ప్రేమకుమార్ వివరించారు. తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
వైభవంగా గుంటి గంగను చేరిన పావనం – ఆచారాల ప్రకారం పలు శాంతి కార్యక్రమాలు నిర్వహణ – ప్రారంభమైన గుంటి గంగ తిరునాళ్ల సందండి –
గంగా భవాని దేవర పుచ్చకాయల వారి ఇంటి నుండి కటకం శెట్టి వంశస్తుల ద్వారా బయలు దేరిన పావనం పలు గ్రామాలలోని భక్తులకు దర్శనమిచ్చినది. పావనం శుక్రవారం గంగా భవాని ఆలయానికి చేరినది. గురువారం రాత్రి సోమవరప్పాడు, రామభద్రాపురం, తూర్పు గంగవరం గ్రామాలలో ఉత్సవంగా భక్తులు దర్శించు కొన్నారు. కొమ్ము వంశస్తులు అమ్మవారి విష్టతను ఆయా గ్రామాల భక్తులకు వివరించారు. తరించిన భక్తులు అమ్మవారికి పలు కానుకలు సమర్పించారు. శుక్రవారం దేవాలయంలో ఆచారాల ప్రకారం పలు కార్యక్రమాలు ముగిసిన అనంతరం సోమవరప్పాడు గ్రామానికి బొల్లిఆవులతో పాటు ఉత్సవంగా తిరిగి తీసుకువెళ్లారు. శుక్రవారం సాయంత్రము నుండి తిరిగి ఉత్సవాలు నిర్వహించుకొంటారు. దేవర ఇంటి వద్ద పంచలోహ తొడుగుతో అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి, బొల్లి ఆవులు, నాగ పడిగలతో ఉత్సవంగా శనివారం ఉదయం ఏడు గంటలకు గుంటి గంగా భవాని ఆలయానికి చేరుతుంది. అమ్మవారికి శాంతి కార్యక్రమాలు, గావు వేట కార్యక్రమం నిర్వహించిన అనంతరం గుంటి గంగా భవాని తిరునాళ్ల ప్రారంభమవుతుంది.







