దాతల సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మించటం అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి అన్నారు. గుంటి గంగలో సర్వజన అన్నదాన సత్రంలో దాతల సహకారంతో రూ. 30లక్షల వ్యయంతో కళ్యాణ మండపాన్ని రెడ్డి అన్నదాన సంత్రం సంఘ బాధ్యుల ఆధ్వర్యంలో అభివృద్ధి చేసారు. మండపాన్ని శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి సర్వజన అన్నదాన సత్రం అభివృద్ధికి తన వంతు చేయూత ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేసారు. ఎల్లప్పుడూ తమ కుటుంబం కూడ తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆహ్లాద కర వాతావరణంలో, విశాలమైన ప్రాంగణంలో కళ్యాణ మండపం ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. చక్కని కళ్యాణ మండపాన్ని నిర్మాణానికి పూనుకున్న కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం సర్వజన అన్న దాన సత్రం (రెడ్డి సత్రం) కమిటీ అధ్యక్షుడు కైపు రామకోటి రెడ్డి, ఉపాక్షుడు ముచ్చుమారి బ్రహ్మారెడ్డి, కార్యదర్శి వేమి రెడ్డి సుబ్బారెడ్డి, కమిటి బాధ్యులు వేడికోల నరసింహారెడ్డి, కోట కళింగరెడ్డి, తిరుపతిరెడ్డి, అన్నపురెడ్డి వీర నాగిరెడ్డి, రమణారెడ్డి తదితరులు అతిథులను ఘనంగా సన్మానించారు. జిల్లా కోఆప్షన్మెంబర్ ఆదాం షరీప్( బుజ్జి), ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సంఘ పెద్దలు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.



