రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు అనుమతిని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం.. ఉన్నత పాఠశాలలు గుర్తింపు కోసం సిబ్బంది, విద్యార్థి, లేబొరేటరీ, లైబ్రరీ, కంప్యూటర్ గది పరికరాల కోసం తగిన వసతిని కలిగి ఉండాలి. అలాగే ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని ఎప్పటికప్పుడు పాటిం చాలి. బాలికలు, బాలురు, దివ్యాంగులు, సిబ్బందికి వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలి. తాగునీరు, ఆట స్థలం, అగ్నిమాపక ఏర్పాట్లు, పార్కింగ్, తదితర నిబంధనలు పాటించాలి. అర్హత కలిగిన సిబ్బందిని నియమించాలి. పబ్లిక్ పరీక్షల్లో వరుసగా మూడేళ్లు 20 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత ఉంటే మూసేసే అధికారం విద్యా శాఖకు ఉంటుం ది. విద్యార్థుల అడ్మిషన్, సిబ్బంది నియామకం, ఇతర విద్యాపరమైన పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అధికారులు జారీ చేసిన అన్ని సూచనలను విద్యా సంస్థలు పాటించాలి. ఏటా సెప్టెంబర్ 30లోపు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యా సంస్థ నిర్ణీత ప్రొఫార్మాలో వార్షిక పాలనా నివేదికను సమర్పించాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశించిన అన్ని ఇతర షరతులను పూర్తి చేయాలి. కాగా ప్రైవేటు పాఠశాలలు గుర్తింపును 8 ఏళ్లకు పెంచడంపై ఎమ్మెల్సీలు కల్పలత, రామచంద్రారెడ్డి, చంద్రశేఖరరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీలకు , ప్రభుత్వానికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు అనుమతి 3 నుంచి 8 ఏళ్లకు పెంపు
23
Apr