వై.ఎస్.ఆర్.కళ్యాణమస్తు”, “వై.ఎస్.ఆర్. షాదీతోఫా” పథకం పేదింటి ఆడపిల్లలకు వరం – జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్

“వై.ఎస్.ఆర్.కళ్యాణమస్తు”, “వై.ఎస్.ఆర్. షాదీతోఫా” పథకం పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ తెలిపారు. కళ్యాణమస్తు, షాదీతోఫా పధకంలో లబ్ధిదారుల తల్లుల ఖాతాలలో మూడవ విడత నగదు జమ చేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తో పాటు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు శాసనసభ్యులు టి.జె.ఆర్. సుధాకర్ బాబు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, పి.డి.సి.సి. బ్యాంకు ఛైర్మన్ వై.ఎం. ప్రసాద రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వీరు లబ్ధిదారులను సన్మానించి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ …కళ్యాణమస్తు, షాదీతోఫా పథకంలో భాగంగా మూడో విడతలో ప్రకాశం జిల్లాలో 524 మంది లబ్ధిదారుల తల్లుల ఖాతాలలో రూ.4.17 కోట్ల నగదును జమ చేశారన్నారు. మొదటి విడతలో భాగంగా 179 మంది లబ్ధిదారులకు రూ.1.67 కోట్లు, రెండవ విడతలో భాగంగా 276 మంది లబ్ధిదారులకు రూ.2.16 కోట్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం 979 మంది లబ్ధిదారులకు రూ.8.01 కోట్ల నగదును జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పధకానికి అర్హులు కావాలంటే ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండి ఉండి, వధూవరులిద్దరూ కచ్చితంగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ నిబంధన వల్ల బాల్య వివాహాలను నియంత్రించడంతోపాటు ఇంటర్, డిగ్రీలు చదవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని పిల్లలకు వై.ఎస్.ఆర్. కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడ పిల్లలకు “వై.ఎస్.ఆర్.షాదీతోఫా” ద్వారా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… పేద కుటుంబాలలోని ఆడపిల్లల వివాహాలు చేయడానికి తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కళ్యాణమస్తు, షాదీతోఫా పథకం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పధకం ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్క ఆడిపిల్ల చదువు మధ్యలో ఆపకుండా, కచ్చితంగా
చదువుకునేలా ఈ పధకానికి సంబంధించిన నిబంధనలు రూపొందించిన ముఖ్యమంత్రికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే టి.జే.ఆర్. సుధాకర్ బాబు మాట్లాడుతూ ..ఈ పథకం వల్ల పేద కుటుంబాలు లబ్ధిపొందుతాయన్నారు. కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ఉన్నత చదువులను మరింత ప్రోత్సహించేలా ఈ పధకం రూపకల్పన చేయడం గొప్పవిషయని కొనియాడారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు.
కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, డి.ఆర్.డి.ఏ. మరియు మెప్మా పి.డి. రవికుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *