రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉపయోగార్ధం 40% సబ్సిడీపై శనగ విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ….రైతులకు ఒక ఎకరానికి 40 కేజీల వంతున ఐదు ఎకరాలకు మించకుండా ఉన్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. జె. జె. 11 రకం సెనగ విత్తనాలు క్వింటాకు రూ. 8100 రూపాయలు ధర ఉండగా 40 శాతం సబ్సిడీకి గాను రూ.4860 రూపాయలకు రైతులకు అందించడం జరుగుతుందని, అదేవిధంగా కాక్-2 రకం క్వింటా ఒక్కింటికి రూ.1450 రూపాయలు ధర పలుకుతుండగా 40% సబ్సిడీపై రూ.8430 రూపాయలకు రైతులకు అందించడం జరుగుతుందని ఈ రెండు రకాలు అందుబాటులో ఉన్నాయని, శనగ సాగు చేయాలని అనుకున్న రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించు కోవాలని చెప్పారు. నగదు చెల్లించినట్లయితే, నాలుగు రోజుల్లో విత్తనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు.
