తాళ్లూరు మండలంలోని దారంవారిపాలెం గ్రామానికి చెందిన మేడగం చంద్రశేఖరరెడ్డి(21) బీటెక్ చదు వుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..దారంవారిపాలెం గ్రామానికి చెందిన మేడగం చంద్రశేఖరరెడ్డి పంజా బ్లోని ఎల్పీయూ యూనివర్శిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్లాడు. పొలంలోని దిగుడు బావిలో నీరు తాగేందుకు దిగగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మెట్లు తడిసి ఉండడంతో జారి బావిలో పడి ఈత రాకపోవడంతో మృతి చెందాడు.. రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుటంబసభ్యులు బంధువుల ఇళ్లలో విచారించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మృతుని తండ్రి పొలానికి వెళ్లి చూడగా బావిలో మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై మోహన్ రావు మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని దర్శికి తరలించారు.
