ఈసీజీ స‌రిగా చూస్తే.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -గుండెలోని అనేక స‌మ‌స్య‌ల‌ను ఇదే చెప్పేస్తుంది – ఖ‌రీదైన చికిత్స‌ల‌తో కొంత‌మందికే ప్ర‌యోజ‌నం – అవి అవ‌స‌ర‌మో.. లేదో ఈసీజీతోనే తేల్చేయొచ్చు -కిమ్స్ ఆస్ప‌త్రి స‌ద‌స్సులో ఎల‌క్ట్రో ఫిజియాల‌జిస్టు డాక్ట‌ర్ హ‌య‌గ్రీవ‌రావు

“ఈసీజీ.. గుండెకు సంబంధించి చేసే అత్యంత ప్రాథ‌మిక ప‌రీక్ష‌. కానీ, దాన్ని స‌రిగ్గా విశ్లేషించ‌గ‌లిగితే గుండె గురించిన ఎన్నో విష‌యాలు తెలుస్తాయి. అస‌లు రోగికి ఏ స‌మ‌స్య ఉంది, దానికి ఎలాంటి చికిత్స అయితే ప్ర‌యోజ‌నం ఉంటుంది, ఎలాంటి మందులు వాడాలి, ఇంత‌కుముందు ఏ స‌మ‌స్య వ‌చ్చింది, భ‌విష్య‌త్తులో ఏం రావ‌చ్చ‌నే విష‌యాల‌న్నీ తెలుస్తాయి. అందువ‌ల్ల జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ల‌తో పాటు కార్డియాల‌జిస్టుల‌కు కూడా ఈసీజీని పూర్తిస్థాయిలో విశ్లేషించే ప‌రిజ్ఞానం ఎంతో అవ‌స‌రం” అని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన ఎల‌క్ట్రో ఫిజియాల‌జీ, పేసింగ్ విభాగం అధినేత డాక్ట‌ర్ బి. హ‌య‌గ్రీవ‌రావు తెలిపారు. అరీథిమియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంట‌ర్ (ఆర్ట్స్) సంస్థ‌.. కిమ్స్ ఆస్ప‌త్రితో క‌లిసి శ‌నివారం రోజంతా నిర్వ‌హించిన అరీథిమియా సింపోజియంలో కోర్సు డైరెక్ట‌ర్‌గా ఆయ‌న మాట్లాడారు. దేశవ్యాప్తంగా చెన్నై, బెంగ‌ళూరు, కోల్‌క‌తా, ఢిల్లీ త‌దిత‌ర న‌గ‌రాల నుంచి సుమారు 50 మంది వ‌ర‌కు ఎల‌క్ట్రో ఫిజియాల‌జిస్టులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రై, ప‌లు విష‌యాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 250 మందికి పైగా కార్డియాల‌జిస్టులు, ఇత‌ర వైద్యులు దీనికి హాజ‌రై త‌మ అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స‌ద‌స్సు ప్రారంభం సంద‌ర్భంగా డాక్ట‌ర్ హ‌య‌గ్రీవ‌రావు మాట్లాడుతూ., “ఈసీజీ అనేది చాలా సుల‌భ‌మైన‌, ఏమాత్రం ఖ‌ర్చులేని ప‌రిక‌రం. కానీ జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్లు, కార్డియాల‌జిస్టులు ఈసీజీని స‌రిగ్గా చ‌ద‌వ‌డం చాలా ముఖ్యం. చికిత్స‌కు సంబంధించి స‌మ‌ర్థ‌మైన చికిత్సా విధానం ఏంట‌న్న‌ది నిర్ణ‌యించ‌డండ‌లో ఇది కీల‌క‌పాత్ర పోషిస్తుంది. దాన్ని స‌రిగ్గా విశ్లేషించ‌గ‌లిగితే, గుండె వైఫల్యం కేసుల్లో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి, హ‌ఠాన్మ‌ర‌ణాల‌ను నివారించ‌గ‌లం. గుండెకు సంబంధించిన చికిత్స‌ల‌లో కార్డియాక్ రీసింక్ర‌నైజేష‌న్ థెర‌పీ (సీఆర్‌టీ) అనేది చాలా ముఖ్య‌మైన‌ది. దీనికి ఒక్కో రోగికి సుమారు రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖర్చ‌వుతుంది. కానీ, ఇది 70 శాతం మంది రోగుల‌కే ఉప‌యోగ‌ప‌డుతుంది. మిగిలిన 30 శాతం మందికి అది ప‌నికిరాదు. ఈసీజీని స‌రిగ్గా చ‌ద‌వ‌గ‌లిగితే ఈ 30 శాతం మందికి ఆ చికిత్స అవ‌స‌రం లేద‌ని చెప్పి, వారికి ఖ‌ర్చు మిగ‌ల్చ‌వ‌చ్చు. వారికి వేరే చికిత్స అవ‌స‌ర‌మైతే దాన్ని సూచించ‌వ‌చ్చు” అని తెలిపారు.

“ఇక్క‌డున్న ఫ్యాక‌ల్టీలో చాలామందికి అపార‌మైన అనుభ‌వం ఉంది. ఢిల్లీ, త్రివేండ్రం, కొచ్చిన్ లాంటి ప‌లు ప్రాంతాల నుంచి వీరంతా వ‌చ్చారు. ఈపీ లేదా సంక్లిష్ట ప్రొసీజ‌ర్ల గురించి కాదు.. ఈసీజీ, అందులో ఉన్న సౌల‌భ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భార‌త‌దేశంలో త‌ర‌చుగా వ‌చ్చే గుండెస‌మ‌స్య‌లు ఏంటో చూశాం. పురుషుల్లో 50-55 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌సులో ఇత‌ర స‌మ‌స్య‌లు అంటే అధిక ర‌క్త‌పోటు, మధుమేహం ఏమాత్రం అదుపులో లేక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి గుండె స‌మ‌స్య‌లు వ‌స్తాయని గుర్తించాం. ఎల‌క్ట్రోఫిజియాల‌జిస్టులుగా ఇక్క‌డ ఉన్న ఫ్యాకల్టీ అంద‌రూ అసాధార‌ణ ప్ర‌తిభావంతులు. వాళ్లు చెప్పే విష‌యాలు అన్నీ నేర్చుకుంటే యువ కార్డియాల‌జిస్టుల‌కు, ఫిజిషియ‌న్ల‌కు ఎంతో ఉప‌యోగంగా ఉంటుంది. విమానాలు స‌రిగా న‌డ‌వ‌క‌పోయినా ఇంత శ్ర‌మ‌కోర్చి వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన అంద‌రికీ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు” అని ఆయ‌న చెప్పారు.

కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ డా. అభినయ్ ఈ సింపోజియంను ప్రారంభించారు. కార్డియాల‌జీ విభాగంలో ఎల‌క్ట్రోఫిజియాల‌జిస్టులు ఉండటం వ‌ల్ల రోగుల సంర‌క్ష‌ణ ప్ర‌మాణాలు గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని ఆయ‌న చెప్పారు. యువ ఫిజిషియన్లు, కార్డియాల‌జిస్టులు ఇలాంటి సింపోజియంల‌కు హాజ‌రైతే, దేశ‌వ్యాప్తంగా ఉన్న గుండె ల‌య నిపుణుల అనుభ‌వం నుంచి నేర్చుకునేందుకు ఎంతో అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *