ప్రకాశం జిల్లా సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. ఇందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రజలను ఆమె కోరారు. “స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్” రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపధ్యంలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ పైనా అధికార యంత్రాంగం దృష్టి సారించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా వివిధ సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి అవ సరమైన సూచనలు, సలహాలను ఆమె స్వీకరించారు. విద్య, వైద్యం, కమ్యునికేషన్, పర్యాటకం, నీటిపారుదల, పరిశ్రమలు, మార్కెట్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి పరచవచ్చని ప్రతినిధులు చెప్పారు. నీటి పారుదల వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా అవసరమైన పనులు చేపట్టడంతోపాటు సిబ్బందిని కూడా నియమించాలని కోరారు. తూర్పువైపున ఉన్న సముద్రతీరం, గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్ట్లతోపాటు పశ్చిమ ప్రాంతంలో ఎకోటూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హార్టీకల్చర్ పంటలను నిల్వ చేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులను, అనుబంధ పరిశ్రమలను నెలకొల్పాలని వారు కోరారు. ప్రకాశం జిల్లా పాడి పరిశ్రమకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, దీనిని కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాల నాయకులు సూచించారు. పశ్చిమ ప్రాంతంలో మిర్చి యార్డ్ ను నిర్మిస్తే ఆయా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రైతు సంఘాల నాయకులు చెప్పారు. పశ్చిమ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీని కేటాయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

