ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను అన్నివిధాల ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖామాత్యులు డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం పొదిలి మండలం కొండాయపాలెం, తాళ్లూరు మండలం రామభద్రాపురం, మాధవవరం గ్రామాలలో జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియాతో కలిసి ఆయన పర్యటించారు. పొదిలిలో స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, తాళ్లూరులో స్థానిక ప్రజాప్రతిదనిధులతో కలిసి వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలకు 17 మండలాలు ప్రభావితమయ్యాయన్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంత రైతులు బాగా నష్టపోయారన్నారు. జొన్న, సజ్జ, అలసందలు, పత్తి, వరి, మినుము పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అదే విధంగా ఉద్యాన పంటలైన బొప్పాయి, కొంత మేర పొగాకుకు కూడా నష్టం జరిగిందన్నారు. ఈ అకాల వర్షాల వలన జిల్లాలో సుమారు 300 నుండి 400 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడంతోపాటు బ్యాంకులు ఇచ్చిన రుణాలను 300 చెల్లించే విషయంలో రీషెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు చట్టం తీసుకువస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లి రైతులకు పంటల ఇన్సూరెన్స్, నష్టపరిహారం సత్వరమే అందేలా చూస్తామన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3749 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 3231 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాధమిక అంచనాలు వేశారన్నారు. వాటితోపాటు 560 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినట్లు ఆమె చెప్పారు. ఈ మేరకు పంట నష్టం ప్రాధమిక అంచనాలను ప్రభుత్వానికి పంపించామన్నారు. పంటలు చాలామేరకు దెబ్బతిన్నాయని, రైతులకు ప్రభుత్వపరంగా అందవలసిన సహాయాన్ని త్వరగా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు, మార్కాపురం మండలాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు భారీగా నష్టపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని మంత్రి మరియు జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. తక్షణమే వారు స్పందించి స్వయంగా దెబ్బతిన్న పంటల పరిశీ లనకు వచ్చారన్నారు. ముఖ్యంగా సజ్జ, పొగాకు పంట రైతులు తీవ్రంగా నష్టపోయారని, సదరు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇన్సూరెన్స్ మరియు నష్టపరిహారం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, తాళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, రమేష్ బాబు కనిగిరి, ఒంగోలు ఆర్.డి.ఓ.లు. కేశవర్థన్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యానశాఖ అధికారి గోపీచంద్, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, స్థానిక అధికారులు పాల్గొన్నారు.


