పోలీసు సంక్షేమంలో భాగంగా జిల్లాలోని ఏ.ఆర్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో మంగళవారం “దర్బార్” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించినారు.
ఈ దర్బార్ లో క్యాజువల్ లీవు, ట్రాన్ఫర్స్, టిఎలు, అలవెన్సులు, ఎఆర్, స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తులు, జిపిఎఫ్ లోన్, మెడికల్ బిల్లులు, సినియార్టీ లిస్టు మరియు ప్రమోషన్ తదితర సమస్యల గురించి జిల్లా ఎస్పీ కి సిబ్బంది విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ వారి సమస్యలను విని, వారికి తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ …ఎఆర్ పోలీసుల సాధక బాధలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, పోలీసు వ్యవస్థకు ఏఆర్ సిబ్బంది ఎన్నెముక లాంటిదని, ఏదైనా లా & ఆర్డర్ సమస్య తలెత్తినప్పుడు ఎఆర్ సిబ్బంది చాలా కీలకమని కాబట్టి అందరూ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, బందోబస్త్, ఎస్కార్ట్ విధులు పట్ల చాల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏఆర్ సిబ్బంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు అలవరచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సమయం దేరికినప్పుడు కుటుంబంతో గడపాలని సూచించారు. ఏఆర్ పోలీసు సిబ్బంది క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాలని, విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన, పోలీస్ శాఖ ప్రతిష్టకు కళంకం తెచ్చే విధంగా సిబ్బంది వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అలాగే వృత్తిపరంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తమ సమస్యలు తెలుసుకోవడానికి ఎస్పీ పోలీసు దర్బార్ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుళ్ళు చలపతిరావు, విజయ్ కృష్ణ మరియు కానిస్టేబుల్ చిన్న మస్తాన్ సోమవారం వివిధ కారణాల వలన మరణించడం చాలా బాధాకరమైన విషయమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటింపజేశారు. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణా రెడ్డి, సీతారామరెడ్డి ఏఆర్ ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



