జిల్లావ్యాప్తంగా వారం రోజులపాటు “బంగారు బాల్యం” కార్యక్రమం క్రింద “బంగారు బాలోత్సవాలు” నిర్వహించబోతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ వారోత్సవాల నిర్వహణ, భాగస్వామ్యం, ఏర్పాట్ల పై బుధవారం ప్రకాశం భవనం నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ….ఈ వారం రోజులపాటు బంగారు బాల్యానికి శ్రీకారం బాలోత్సవాలతో ప్రారంభం, మన హక్కులు తెలుసుకుందాం, మనకోసం మనం, మా పిల్లలు మా బాధ్యత, సదా బాలల సేవలో, మా కళలు-మా స్వప్నాలు, చేయి చేయి కలుపుదాం-బంగారు బాల్యాన్ని అందిద్దాం. అనే ఇతివృత్తాలతో ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ దిశగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ ర్యాలీలు, కమ్యూనిటీ మీటింగ్స్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బాలల హక్కులు, వాటి పరిరక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ పధకాలు, వాటిని పొందేందుకు అర్హతలు, తదితర అంశాలపై విస్తృత స్థాయిలో సమాజంలోని అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలకు జిల్లా స్థాయిలోనూ పోటీలు నిర్వహించి ఈ నెల 20వ తేదీన ఒంగోలులోని మినీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. విజేతలైన విద్యార్థులతోపాటు ఆయా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న అధికారులకు కూడా బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
కేవలం వారోత్సవాలతోనే సరిపెట్టకుండా జిల్లాలోని 0-18 ఏళ్ల బాలల హక్కుల పరిరక్షణ, వారి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేసేలా సంబంధిత శాఖల | అధికారులతో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం గ్రామ స్థాయి కమిటీ సమావేశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం డివిజన్, నాలుగో శుక్రవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఉంటుందన్నారు. స్కూల్ నుంచి డ్రాపవుట్, బాల కార్మిక, బాల్య వివాహం, అనారోగ్యాల బారిన పడే బాలలను గుర్తించి ప్రతి ఒక్కరి పరిస్థితికి తగినట్లుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. పేదరికంలేని ఆంధ్రప్రదేశ్ అవతరించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా విద్యావంతమైన, ఆరోగ్యకరమైన, బాల్య వివాహ రహితమైన, బాల కార్మిక రహితమైన ప్రకాశం జిల్లా కూడా ఆవిష్కృతమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి డివిజన్లోనూ ఒక మండలాన్ని ఎంపిక చేసి అందులోని గ్రామాలన్నీ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామాలుగా మార్పు చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. ఈ దిశగా సంబంధి త శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ డి.ఆర్.ఓ. బి.చినఓబులేసు, ఐ.సి.డి.ఎస్. పి.డి. మాధురి, డి.ఈ.ఓ. కిరణ్ కుమార్, మెప్మా పి.డి. రవికుమార్, డి.ఆర్.డి.ఏ. పి.డి. వసుంధర, డి.ఎం.హెచ్.ఓ. సురేష్ కుమార్, డి.సి. హెచ్.ఎస్. సూరిబాబు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, జడ్పీ సి.ఈ.ఓ. చిరంజీవి, బి.సి. సంక్షేమ అధికారి అంజల, రిమ్స్ సూపరింటెండెంట్ జమున, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
|ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతోనూ …
పిల్లల బంగారు బాల్యం కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో, బాల్య వివాహ రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కృతమవడంలో ప్రైవేటు పాఠశాలలు కూడా కలిసిరావాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో బుధవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బంగారు బాలోత్సవాలను పండుగ వాతావరణంలో అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని వారికి సూచించారు. విద్యతోపాటు బాలల ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని, డ్రాపవుట్స్ లేకుండా చూడాలని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పిల్లలందరితో ప్రతిజ్ఞ చేయించాలని చెప్పారు.
ఈ సమావేశంలో డి.ఈ.ఓ. కిరణ్ కుమార్ నిర్వాహకులు పాల్గొన్నారు.



