చదువుతోనే సమాజంలో పేదరికం అంతమవుతుందని, తమ ప్రభుత్వం విద్యకే మొదటి ప్రాధన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు….నెల్లూరు జిల్లా బోగోలు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో రాత్రి పూట మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, పరిసరాలు పరిశీలించిన మంత్రి పారిశుద్ధ్య నిర్వహణలేమి, లైట్లు వెలగకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. గతంలో ఇదే పాఠశాలలో ఓ విద్యార్దినిని పాము కరిచిన ఘటన పట్ల మంత్రి దిగ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి సిబ్బందికి ఆదేశించారు. పాఠశాల పక్కనే ఉన్న నీటికుంటను వెంటనే పూడ్చివేయాలన్నారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి మంత్రి సూచించారు. అనంతరం మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….. చదువుతోనే సమాజంలో పేదరికం అంతమవుతుందని,పేదల విద్యకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కష్టపడి చదివి ఉన్నత స్ధానాలకు ఎదగాలన్నారు.




