విపత్తులను సమర్ధంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మాత్యులు వి.అనిత అన్నారు.
ఈ దిశగా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డి.ఆర్.ఉండాల బి.చిన ఓబులేసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ …..విపత్తుల సమయంలో ప్రాణ నష్టం జరగకుండా చూడటం అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం డ్రోన్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. స్థానిక నీటి వనరులపై శిథిలావస్థలో ఉన్న చప్టాలను గుర్తించి వాటి పునర్నిర్మాణానికి అవసరమైన అంచనాలను ప్రభుత్వానికి పంపించాలని ఆమె చెప్పారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూడా గుర్తించి సమగ్ర డేటాను స్థానికంగా అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. వరదలు, ముంపు సమయంలో తరలించే ప్రజల కోసం పునరావాస కేంద్రాలతో పాటు వారి పశువులను కూడా పెట్టడానికి అవసరమైన షెడ్లు అవసరమని పలువురు కలెక్టర్లు సూచించగా, ఈ దిశగా ప్రతిపాదనలు పంపించాలని హోం మంత్రి చెప్పారు. విపత్తులను ఎదుర్కోవటానికి అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్.ఓ.పి) ముసాయిదాను అన్ని జిల్లాలకు పంపుతామని, వాటిని పరిశీలించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె చెప్పారు. విపత్తుల సమయంలో ఉపయోగపడేలా గతంలో ఎంపిక చేసిన స్థానికులకు అవసరమైతే మరోసారి శిక్షణ ఇచ్చే విషయం కూడా పరిశీలిస్తామన్నారు. గత అనుభవాలను, డేటాను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డి.పి.ఓ. వెంకట నాయుడు, సి పి ఓ వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్ధక అధికారి బేబీ రాణి, జిల్లా వైద్యాధికారి పద్మజ, జిల్లా మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఏ.పీ.సి. పి. డి.సి.ఎల్. ఎస్.ఈ. రమేష్, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. దేవానంద్, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, ఏ.పి.ఎం.ఐ.పి. ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ.వీ.రమణ, హౌసింగ్ పీ.డి.శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జి.ఎం.శ్రీనివాసరావు, జిల్లా పర్యాటక అధికారి బెనహర్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


