తిరుమల తిరుపతి దేవస్థానములు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో స్థానిక గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో ఈనెల 16వ తేదీ సోమవారం నుండి ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులుచే తిరుప్పావై ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు మందిరం భక్త బృందం నిర్వాహకురాలు సురేఖ తెలిపారు. సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతున్న దృష్ట్యా గోదాదేవి రచించిన 30 పాశురాలపై ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ భోగి వరకు నెలరోజులు తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి తిరుప్పావై, భగవద్గీత పారాయణ, 9 గంటలకు నుండి తిరుప్పావై పై ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. కనుక భక్తులు ప్రతిరోజు జరిగే తిరుప్పావై ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి, గోదాశ్రీరంగనాధుల అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరారు. తిరుప్పావై ప్రవచనానికి సంబంధించి గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం భక్త బృందం కృష్ణ, రాజేష్, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, అరుణ, అనిత, రాధా తదితరులు పాల్గొన్నారు.

