సమ సమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా పోరాడిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు
చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ… అంబేద్కర్ గొప్ప మేధావి, దార్శనికుడు అని కొనియాడారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో ముందు చూపుతో ఆలోచించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఇదే దృక్పథంతో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్లో చేసిన కేటాయింపులే దీనికి నిదర్శనమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కాలనీలలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పక్కా గృహాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో మరమ్మతులకు రూ.143 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందులో ప్రకాశం జిల్లాకు సుమారు 13 కోట్లను ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుత అంబేద్కర్ భవనములో శాశ్వత ప్రాతిపదికన ఫర్నిచర్,
మైక్ సిస్టమ్, మరిన్ని ఏ.సీ.లు ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. అదేవిధంగా అంబేద్కర్ జీవిత చరిత్ర వివరాలతో కూడిన ప్రత్యేక లైబ్రరీని కూడా ఇందులోనే ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు. ఒంగోలులో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను కూడా ఏర్పాటు చేయిస్తానని జనార్దన్ రావు ప్రకటించారు. ఆయా విషయాలలో దళిత సంఘాల ప్రతినిధులు చర్చించుకుని తన వద్దకు రావాలని ఆయన చెప్పారు. పేద ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తాను కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ …పేద ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, హక్కుల సాధన కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కరుకే
దక్కుతుందని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత 62% అని, మహిళల్లో ఇది 53% అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత మరింత తక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఈ పరిస్థితిని మార్చడంతో పాటు బడి వయస్సు పిల్లలందరినీ బడిలో చేర్పించేలా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినట్లు తెలిపారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ సంఘాల నాయకులు ప్రస్తావించిన ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీలలో ఇవి ఎక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితిని సరిదిద్దడంపై యంత్రాంగం దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ …చరిత్రను తెలుసుకోలేని వారు భవిష్యత్తును నిర్మించలేరని అన్నారు. అణగారిన ప్రజల జీవితా లలో వెలుగులు నింపేలా సరైన సమయంలో పుట్టిన సరైన మనిషి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తితో మరిన్ని పనులు చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
మేయర్ మాట్లాడుతూ … చట్టాల రూపకల్పనకు, వ్యవస్థల పనితీరుకు ఆధారమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని ప్రశంసించారు. అంబేద్కర్ కేవలం దళితులకు
చెందిన వ్యక్తి మాత్రమే కాదని, ఆయన అందరి వాడని ఆమె అన్నారు. అణగారిన వర్గాల ఐక్యత, వారి హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి కవి, గాయకుడు నూకతోటి శరత్ స్వయంగా రచించి, గానం చేసిన ప్రత్యేక వీడియో గీతాన్ని అతిథులు ఆవిష్కరించి వీక్షించారు. సినిమా థియేటర్లలో ఇంటర్వల్ సమయంలో ఈ పాటను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే జనార్ధన్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి. చిన ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ. అర్జున్ నాయక్, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీ.డీ. శ్రీనివాస ప్రసాద్, మెప్మా పి.డి. శ్రీహరి, APEWIDC E.E. భాస్కర్ బాబు, ఒంగోలు ఎం.ఈ.ఓ. కిషోర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దళిత, గిరిజన సంఘాల నాయకులు నీలం నాగేంద్రం, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, చప్పిడి వెంగళరావు, బిల్లా చెన్నయ్య, తోరతోటి ఆనంద్ మాదిగ, పీ.విజయేంద్ర బహుగుణ, కొమ్ము సుజన్ మాదిగ, సిహెచ్ ఆంజనేయులు, సిహెచ్ రవిశంకర్, దారా అంజయ్య, అశోక్ బాబు, పేరం సత్యం, పొట్లూరి లక్ష్మయ్య, పీ. సుభాష్ చంద్రబోస్, టీ. అంజయ్య, వై. శశిభూషణ్, కోటి మాదిగ, లింగంగుంట రవికుమార్, బొమ్మతోటి రమణమ్మ, ఆదిమూలపు ప్రకాష్, రఘురాం, పెద్దిపోగు కోటేశ్వరరావు, గొట్టిముక్కల సురేష్, చప్పిడి కోటేశ్వరరావు, చేజర్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా, తదితరులు పాల్గొన్నారు. దళిత, గిరిజన సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టరును, ప్రజాప్రతినిధులను వారు కోరారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు.
దీనికి ముందుగా HCM సెంటరులోని అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం కలెక్టరేట్ సెంటరులోని అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి అంజలి ఘటించారు. HCM సెంటర్లో కేక్ కట్ చేశారు.




