కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి -రూ.30 వేల కోట్ల‌తో సంక్షేమ పెన్ష‌న్లు -ద‌శ‌ల వారీగా హామీలు అన్నీ అమలు చేస్తాం – క‌రెంట్ క‌ష్టాలు తీర్చ‌డానికి స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం -రాజ‌ధాని లేకుండా చేసిన వైసీపీ.., రాష్ట్రాన్ని న‌వ్వుల పాలు చేసింది -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వ‌మ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. కందుకూరు నియోజ‌క‌వర్గంలో సోమ‌వారం ప‌ర్య‌టించిన ఆయ‌న., ఉల‌వ‌పాడు మండ‌లం మ‌న్నేటికోటలో సుమారు రూ.4 కోట్ల‌తో నిర్మించే 33-11కేవీ విద్యుత్ స‌బ్ స్టేష‌న్ కు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వ‌ర‌రావుతో క‌లిపి శంకుస్థాప‌న చేశారు. వ్య‌వ‌సాయ‌ప‌రంగా లో ఓల్టేజ్ స‌మ‌స్య‌ల కార‌ణంగా రైతులు ఇబ్బంది పడ‌కూడ‌ద‌నే స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  అనంత‌రం అదే మండంలంలోని బ‌ద్ధిపూడి గ్రామంలో సీసీ రోడ్ల‌తో పాటు వాటర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ… రైతుల‌తో పాటు ప్ర‌జ‌లెవ్వ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని లోడ్ కు అనుగుణంగా అవ‌స‌రం అయిన ప్రాంతాల్లో స‌బ్ స్టేష‌న్లు నిర్మిస్తున్న‌ట్లు వివ‌రించారు. పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంతో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇంటిపైన సోలార్ ప్యానళ్ళు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. దీని వ‌ల‌న క‌రెంట్ క‌ష్టాలు కొంత మేర త‌గ్గుతాయ‌న్నారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా ఎస్సీ, ఎస్టీల‌కు ఉచితంగా, బీసీల‌కు రాయితీ అందుతుంద‌ని చెప్పారు. స‌బ్ స్టేష‌న్లు ఉన్న ప్రాంతాల్లో పీఎం కుసుమ్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేసి రైతుల‌కు అందిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ 10,000 సూర్య‌ఘ‌ర్ క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నామ‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. అదే విధంగా కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో మొత్తం 20 ల‌క్ష‌ల సూర్య‌ఘ‌ర్ క‌నెక్ష‌న్ల‌కు అనుమ‌తులు పొందామ‌ని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*సంక్షేమ పెన్ష‌న్ల‌తో నూత‌న శ‌కానికి నాంది…*

కేవ‌లం సంక్షేమ పెన్ష‌న్ల కోస‌మే సుమారు రూ.30 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న శ‌కానికి నాంది ప‌లికింద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. రూ.రెండు వేలు ఉన్న సామాజిక పెన్ష‌న్ ను రూ.3 వేలు చేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వానికి ఐదేళ్లు ప‌ట్టింద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కేవ‌లం ఒక్క సంత‌కంతో మూడు వేల పెన్ష‌న్ల‌ను నాలుగు వేల‌కు పెంచ‌డ‌మే కాకుండా నాలుగు వేలు ఉన్న పెన్ష‌న్ల‌ను ఆరు వేల రూపాయిలు చేశామ‌న్నారు. రూ.10 వేల దివ్యాంగుల పెన్ష‌న్ ను 25 ల‌క్ష‌ల మందికి ఇస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. పూర్తి స్థాయి దివ్యాంగుల పెన్ష‌న్ ను కూడా నెల‌కు రూ.15 వేలు చేశామ‌ని మంత్రి గొట్టిపాటి చెప్పారు. గ‌త ఐదేళ్ల‌లో రోడ్ల మ‌ర‌మ‌త్తుల‌కు ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌ని తెలిపిన గొట్టిపాటి.., కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే రూ.800 కోట్ల‌తో ర‌హ‌దారుల మ‌ర‌మ‌త్తులు చేయ‌డ‌మే కాకుండా.., రూ.600 కోట్ల‌తో తారు రోడ్లు బాగు చేశామ‌ని తెలిపారు. అన్న క్యాంటీన్లను మ‌ర‌లా ప్రారంభించామ‌న్నారు. సూప‌ర్ సిక్స్ లో భాగంగా ఇప్ప‌టికే ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తున్నామ‌ని, ద‌శ‌ల వారీగా అన్ని నెర‌వేరుస్తామ‌ని తెలిపారు.

*రాజ‌ధాని కాల‌యాప‌న‌తో రాష్ట్రం న‌వ్వుల‌పాలు…*

మూడు రాజ‌ధానులంటూ కాల‌యాప‌న చేసిన వైసీపీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు రాజ‌ధాని లేకుండా చేసింద‌ని మంత్రి గొట్టిపాటి మండిప‌డ్డారు. రాష్ట్ర రాజ‌ధాని ఎక్క‌డ అంటూ అంతా న‌వ్వుతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మే 2వ తేదీ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణం చేయ‌నుండ‌డం., కూట‌మి ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అన్ని ప్రాంతాల‌నూ స‌మానంగా అభివృద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో విశాఖ‌లో సాఫ్ట్ వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. హైద‌రాబాద్ సాఫ్ట్ వేర్ అభివృద్ధి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దార్శనిక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. రాయ‌ల‌సీమ ప్రాంతంలో పునరుత్పాద‌క విద్యుత్ ప్రాజెక్టుల పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. ద‌ర్శి, క‌నిగిరి ప్రాంతంలో త్వ‌ర‌లోనే రెండు సోలార్ పార్క్ ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

*తెలుగుదేశంలోకి 500 కుటుంబాలు……*

ఉల‌వ‌పాడు మండ‌లం బ‌ధ్ధిపూడి గ్రామానికి చెందిన రాఘ‌వ‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో గ్రామానికి చెందిన సుమారు 500 కుటుంబాలు మంత్రి గొట్టిపాటి స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. కూట‌మి ప్ర‌భుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌న్న విశ్వాసంతో తామంతా తెలుగుదేశం పార్టీలో చేరిన‌ట్లు ప‌లువురు పేర్కొన్నారు. అదే విధంగా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌త్య్స‌కార భ‌రోసా అందుకున్న ప‌లువురు ల‌బ్ధిదారులు మంత్రి గొట్టిపాటికి త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో స్థానిక కూట‌మి నేత‌ల‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *