బస్టాండు ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, ప్రాంగణంలో పారిశుద్ధ్యము, దుకాణంలోని వాటర్ బాటిల్స్ మరియు కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్న ధరలు, విచారణ కేంద్రం, బస్సుల టైమ్ టేబుల్, ఫిర్యాదుల పెట్టె, పార్సెల్ కౌంటర్ , తదితర విభాగాలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ….బస్టాండ్ లోని దుకాణాల్లో నిర్ణీత ధరల కంటే అధిక రేట్లకు ఏవైనా విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్ జి.సత్యనారాయణను ఆదేశించారు. ప్రాంగణంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి నెల మూడో శనివారం ” స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నందున బస్టాండ్ ప్రాంగణాన్ని కూడా శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. బస్సుల కోసం బస్టాండ్లో వేచి ఉండే ప్రయాణికులకు అవసరమైన సీట్లు, ఫ్యాన్లు , టాయిలెట్స్ లో సక్రమంగా నీరు ఉండేలా చూడాలని ఆదేశించారు. బస్టాండు ప్రాంగణంలో మంచి వాతావరణం ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆమె స్పష్టం చేశారు. ఆయా విషయాలలో ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది కలిగితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా ఒక ఫోన్ నంబరు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డిపో మేనేజర్ శ్రీనివాసులు, సూపర్వైజర్ ఫణి కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.


