వృద్ధులు మన సమాజానికి అనుభవ గనులు అని జిల్లా రెవిన్యూ అధికారి బి.చిన ఓబులేసు అన్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులకు బుధవారం ప్రకాశం భవనంలో జరిగిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ” తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 మరియు స్టేట్ రూల్స్ 2011 ” పై రీజనల్ రిసోర్స్ శిక్షణ కేంద్రంతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ బిడ్డలు తమ ఆస్తులను తీసుకున్నారు గానీ తమ పోషణ గురించి పట్టించుకోవటం లేదని గ్రీవెన్స్ కార్యక్రమంలో సైతం ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సమాజంలో ఇలాంటి ధోరణ సరికాదన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వారి పోషణ, సంరక్షణను విస్మరించటం సరికాదన్నారు. చట్ట ప్రకారం కూడా ఇది శిక్షార్హమైననేరమని చెప్పారు. ఆయా చట్టాలపై జిల్లా అధికారులు అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. బాధితులుగా ఉన్న వృద్ధులు సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లయితే న్యాయపరంగా వారికి ఉన్న అవకాశాలను తెలియజేయడంతో పాటు వయోవృద్ధుల సంక్షేమ శాఖ దృష్టికి కూడా తీసుకురావాలని డిఆర్ఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. నాగేశ్వరరావు, రీజినల్ రిసోర్స్ శిక్షణ కేంద్రం ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


